అది వంగదేశపు ముఖ్యపట్టనమున ఒకానొక వర్షాకాలపు ఉడుకు మధ్యాహ్నము. శీతావహమగు
రైలు పెట్టెలోంచి అప్పుడే దిగిన మేము, ఈ వాతావరణానికి వొడలు బరుక్కుంటూ కిందకి
దిగి, వరదబాధితుల మాదిరి మోసుకొచ్చిన మా బండెడు మూటలను బయటకీడ్చితిమి. అక్కడి
నుండి మా కళాశాలకు ప్రయాణించిన ఆ అరగంటలో చూస్తిమి గదా, కలకత్తానగరవీధుల
విడ్డూరాలు.... ఇక్కడి రహదారులు రైళ్ళ రాకపోకలకై ఏర్పరచబడిన ప్లాటుఫారాలు, ఇక్కడి వీధులు
సర్వభక్ష్యపాకనిమిత్తము నిర్మించబడిన స్థావరాలు, ఇక్కడి ఫుట్పాతులు సకలజనుల
శౌచావసరములకై పరచబడిన స్నానశాలలు. ఆ అద్భుతాలకు అబ్బురపడుతూ, ఆ విడ్డూరాలకు
బుగ్గలు నొక్కుకుంటూ ఆఖరికి మా వసతిగృహము చేరితిమి. అక్కడ చూద్దుము కదా,
స్వతంత్రపూర్వ నిర్మిత శిథిల కట్టడాలవి. రాత్రిభోజన సమయం కాబోలు, ఘాటైన ఆవనూనె
వాసన గుప్పుమని మొహమంతా ఆవిరి పరచి మమ్మల్ని లోగిట్లోకి ఆహ్వానించినది.
అప్పుడర్థముగాలేదు ముందున్నది మొసళ్ళపండగని.
కిర్రుమనే మంచాలతో కీచుమనే గబ్బిలాలతో ఉండునన్న మా ఊహలకు ఊతమిస్తూ మా గదులు
రెట్టవాసనలతో మాకెదురేగినవి. మూలనెచటనో తొలుస్తున్న సంశయాన్ని అదిమి, జారిన
గుండెని దిటవు చేసుకొని స్నానపుశాలలో ప్రవేశించితిమి. అంతే, అప్పుడు తగిలిన
విద్యుద్ఘాతానికి మా మస్తిష్కాలు మాడి మసైనవేమో? వరుసబెట్టి మూడు శౌచాలయాలు,
వానికెదురుగా ద్వారరహితములగు రెండు స్నానపుగదులు. ఏవిటీ చోద్యం? శౌచాలయలములకు వెలుపలకు
తెర్చుకొను తలుపులేల? వానికెదురుగా తలుపుల్లేని స్నానపుగదులేల? పూర్వ సహస్రాబ్దపు
మూకుమ్మడి స్నానశాలలనుకుకొంటిడా? లేక హరప్పా నాటి సామూహిక మహా స్నానవాటికలనుకొంటిడా?
యే శుభోదయమునో లేచి యేమరపాటున దీర్ఘశంకకుబోయి దఢాలున తలుపు తీస్తే? నాకు అవతలివాడి
విశ్వరూప దర్శనమైపోదా? అప్పుడు వాని గతేమిటి? అసలు నా సంగతేమిటి? అంతకంటే
మహాద్భుతం నాకామరుసటి ఉదయమున గోచరించినది. ప్రాతఃకాలమున లేచి స్నానమాచరిస్తున్న నేను
తలెత్తి చూడగానే పలకరించినది, ఎదురుగా పైనున్న ఒకానొక అర్ధకుడ్యమండలాక్రమిత
కవాటరహిత గవాక్షము! సంధ్యావందనాదుల నిమిత్తము కాబోలు! అందున చూస్తే ఆవలివీధియింటి
ముదుసలి దండెముపై రెపరెపలాడుతున్న గోచీగుడ్డసైతం నీ కళ్ళముందు మెదలాడుద్దనిన
కల్లకాదు. యే ఎదురింటి వానికో నయనాందకర అర్ధనగ్న దృశ్యకావ్య ప్రసారార్థము కాకపోతే
మరెందుకన్నట్లో ఈ కవాటరహిత కుడ్యరంధ్రములు!
ఆ మరుసటి దినమే శీఘ్రగతిన ఆరంభమైనది మా గృహాన్వేషణ. భగభగమను భానుడి
తాపమునకొడలు ఎండగా, కుండజార్చిన మేఘుడివానకొళ్ళు నానగా, తళుక్కుమను తారుదారులపై
యోజనాలు నడచిన దెబ్బకు గొంతు ఆరగా, కడుపు మాడగా మేము మా అన్వేషణ కొనసాగించిమి.
ఆఖరున ఒక శ్రావణ బహుళ ఏకాదశి శుభదినమున మా పూజ్యగురువుల పుణ్యముకొలది ఒకానొక
ఇంటిని చేపట్టి, ఆ నాలగవదినమున
అమావాస్యను విస్మరించి గృహప్రవేశముగావించితిమి.
అదొక గృహసముదాయములో కిందిఅంతస్థులోని గృహము. మా ఎదురింటాయన ఆ గృహసముదాయపు
సంఘకార్యదర్శి. గౌరవనీయులైన కార్యదర్శిగారు మమ్ముల సాదరముగనాహ్వానించి, సంఘ
నియమావళిని విశదపరచితిరి. కానీ వారు మరొక విషయమునుటంకించుట మరచితిరి కాబోలు.
దానిప్రభావరీత్యా మాకారాత్రి జరిగిన సత్కారము, తిరుమల శ్రీవారి శయనసేవలను
మీరిపోయినవనిన కల్లకాదు. రేయి పదిన్నర గంటలుకొట్టిన పిమ్మట శ్రీవారి గర్భగుడి
గుమ్మాలు మూసినట్లు, మాయింటి గదితలుపులు బిడాయించి బయటొక తాళంకప్పను తగిలించితిరీ
ప్రబుద్ధులు. అదేమని అడుగగా; జీవితకాలమెల్ల తంబాకునమిలీ, దానికే బలైచచ్చిన ఒకానొక
పీనుగనుండి అరువుకుదెచ్చుకొనిన అరనవ్వును మొగమున పులుముకొని అనిరిగదా “యిదివరకిది
అతిథిగృహము, వచ్చిపోవువారి వివరములు మాకెరుకలేని కారణమున యీ ‘భద్రతాచర్య’కు
పూనుకొంటిమి. ఇప్పుడిది వసతి గృహము, కావునఈ విషయమును తదుపరి సంఘసమావేశములో
సమీక్షించెదము, అంతవరకు చీకటిన దొడ్డిద్వారమును వాడుకొండ”ని సలహావిసిరి తమ
విపరీతచర్యని సమర్థించుకొనిరి.
మేమున్నూ మాయేడుపుమొగముతో యికిలించి లోనకుజేరితిమి. మమ్ములలోనబెట్టి బయటతాళము
వేయవిషయము దేల్చుట ప్రత్యేకించి ఒకసమావేశముజేయ జుగుప్సాపూరిత
సంకల్పముగావించితిరేవిటా యీ ప్రబుద్ధులని తెల్లబోయితిమి మేము.
అరగంటపాటు యీ
అర్ధమస్తిష్క కూపస్థమండూకములు తమ తూముని జేరి బెకబెకలాడి ముగియించిన సమావేశపు
సారాంశమేమనిన “అరశతాబ్దకాలముపాటు అరకొర
ఉద్యోగముజేసి బల్లల క్రిందామీదాబడి నొక్కిన రొక్కముదాచీ, ధరలుసన్నగిలునప్పుడు
అవుసలికొట్లముందు యుగాలపాటు జాగారముజేసి, చొంగగార్చుచు పడి కొని యిండ్లకుబోయి
భోషాణముల కుక్కి మురుగబెట్టిన స్వర్ణాభరణాలను కాపాడునిమిత్తమున్నూ; కొప్పుపై
కొంగులాగీ, ఘనకుచద్వయమును బిగియించి రావికెగట్టీ, గంగాళపుమూతివంటి నడుమునకిరుమారు
చీరజుట్టీ, మునిపాదమంటునట్లు కుచ్చిళ్ళులాగీ కనిపెట్టుకొనివచ్చియున్న
వారింటియాడువారి శీలపరిరక్షణార్థమున్నూ; చేవలేని ఉద్యోగమునజేరి చచ్చుబడి
పనిచేయలేకా, శీతావాహగదులయందు చక్రాలకుర్చీలకు తమ జఘనములనంకితమిచ్చి లంబోదరులై
పనిజేయకా, రోజూయింట భార్యామణుల చేతిచరుపులంటిచుకొనుచు పనికిరాకా, ఈ తూములో
ఒకచెంతజేరి ప్రాణాలు నెట్టుకొనుచున్న ఈ మండూకశ్రేష్ఠుల
నాగరికతాపరిరక్షణార్థమున్నూ, తమ పూర్వపు యవ్వారములు నిరాటంకముగ కొనసాగింప ఏకగ్రీవతీర్మానము
గావించితిర”ట యీ మృణ్మస్తిష్కులు!
No comments:
Post a Comment